మనము అద్భుతములు చేయగలిగిన మహా దేవునిని సేవిస్తున్నాము, మరియు ఆయన స్వస్థత ప్రభావములు ఈనాటికి ఈ లోకంలో పనిచేయు చున్నవి గనుక ఆయనకు కృతజ్ఞ్యతాస్తుతులు చెల్లించగలము!
దేవుడు రోగులను ఇంకా స్వస్థపరుస్తున్నాడా? మీరు ఎప్పుడైనా శ్రమ అనె చీకటి లోయ గుండా నడిచినట్లయితే, లేదా మీకు ప్రియమైన వ్యక్తి బహు బాధాకరమైన లేదా బలహీనపరచే ఏదెైనా వ్యాధితో బాధపడటం చూచినట్లైతే, ఈ ప్రశ్నకు సమాధానం యొక్క ప్రాముఖ్యత మీకు తెలుసు.
బైబిలు యొక్క పాత నిబంధన గ్రంధములో దేవుని యొక్క అద్భుత స్వస్థత కార్యములను తెలిపే అనేక ఉదాహరణలు మనము చదువగలము. రాజైన హిజ్కియా మరణించే స్థితిలో ఉన్నప్పుడు, అతడు దేవుని వేడుకొనెను, అప్పుడు దేవుడు అతని ఆయుష్కాలమును (జీవిత కాలమును) మరో 15 సంవత్సరములు పొడిగించెను. అలాగే దేవుని ప్రవక్త అయిన ఎలీషా చెప్పిన మాటలకు నయమాను విధేయత చూపి వాటి ప్రకారము చేసినప్పుడు, నయమాను కుష్టు వ్యాధి నుండి స్వస్థత పొందెను మరియు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్ధించి నప్పుడు దేవుడు అతనికి సమస్త వ్యాధి బాధలనుండి సంపూర్ణ విడుదల మరియు స్వస్థత కలుగజేసెను.
యేసుక్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు, అనేకమంది జనులు ఆయనయొద్దకు వచ్చినప్పుడు, ఆయన వారికి రోగములు మరియు వ్యసనముల నుండి విడుదల మరియు స్వస్థత కలుగజేసెను. యేసుక్రీస్తు శిష్యులలో ఒకరైన పేతురు యొక్క అత్తను జ్వరము నుండి స్వస్థపరచెను. అలాగే, జనసమూహమును దాటలేక, ఇంటి పైకప్పు నుండి యేసుక్రీస్తు కూర్చున్న స్థలములోకి మంచముతో సహా దించబడిన పక్షవాతంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు స్వస్థపరచెను. ఆయన కుష్టు వ్యాధి గ్రస్తులను శుద్ధిచేసెను, గుడ్డివారికి చూపు అనుగ్రహించెను, దయ్యములను వెళ్ళగొట్టెను. మరియు "బహు జనులాయనను వెంబడింపగా, ఆయన వారినందరిని స్వస్థపరచెను" అని మనము బైబిలు గ్రంధము యొక్క మత్తయి సువార్త 12:15-16 లో చదువగలము. అయితే యేసు క్రీస్తు యొక్క స్వస్థత శక్తి నేటికి అంతే శక్తిమంతంగా ఉన్నదా? ఆయన రోగులను ఇప్పటికీ స్వస్థపరచునా? లేదా వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ బైబిల్ సంగతులకు మాత్రమే దేవుని స్వస్థతా శక్తి పరిమితమా? అని నీవు అడుగవచ్చు.
దేవునికి స్తోత్రం! యేసు క్రీస్తు యొక్క స్వస్థత శక్తి నిరంతరము ఏకరీతి గానే ఉన్నది. "యేసుక్రీస్తు నిన్న, నేడు ఒక్కటేరీతిగా ఉన్నాడు. అవును ఆయన యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును."(హెబ్రీయులకు 13:8) ఆయన స్వస్థత శక్తి అంతము లేనిది. ఆయన మన శరీరములను రూపించెను. ఆయన మన శారీరక బలహీనతల నుండియు, మరియు మనోవ్యాధి నుండియు స్వస్థత కలుగజేయుటకు ఈనాటికి సమర్థుడు! ఆయన స్వస్థపరచలేని రోగమేదియు ఈ లోకంలో లేదు. మనిషి యొక్క అత్యంత ప్రగతిశీల పద్ధతులు విఫలం కావచ్చు; వైద్య రంగంలో గుర్తించదగిన విజయాలు ఉన్నా ఇప్పటికీ లెక్కలేనన్ని ప్రశ్నలకు సమాధానం మానవుడు ఇవ్వలేడు, కానీ "మనుషులకు అసాధ్యము లైనవి దేవునికి సాధ్యములు" (లుకా సువార్త:18:27).
యేసుక్రీస్తు పొందిన దెబ్బలచేత కొనబడినవారము
ఈ సృష్టిలో మొట్టమొదటి మానవుడైన ఆదాము మరియు హవ్వ చేసిన పాపము ద్వారా రోగము, బాధలు మరియు మరణము ఈ లోకంలోనికి ప్రవేశించెను. పాపము చేయుట ద్వారా వచ్చిన శాపం నుండి, మానవాళికి విమోచన కొరకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చెను. "అతడు (యేసుక్రీస్తు) పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది." (యెషయా: 53:5)" సిలువపై యేసు మరణంలో ఈ వాగ్దానం నెరవేరిన రోజును యెషయా ప్రవక్త వందల సంవత్సరాలు ముందుగానే పరిశుద్ధ ఆత్మ ద్వారా చూచి ఈ వచనమును పలికెను. పాపము యొక్క శిక్ష నుండి మనకు విడుదల అనుగ్రహించుటకు, దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపెను. దేవుడైన యేసుక్రీస్తు ఈ లోకమునకు మనుష్య రూపమున వచ్చి, కల్వరి సిలువపై మరణమొందుట ద్వారా మనకు రక్షణ మార్గమును ఏర్పరచెను. అంతేకాక, సిలువలో తన అమూల్యమైన స్వరక్తమును చిందించుట ద్వారా మన శారీరక రోగములు మరియు మనోవ్యాధి నుండి స్వస్థత కలుగజేసి దేవుని యొక్క వాగ్దానమును నెరవేర్చెను. ఇదే మనము మత్తయి సువార్త 8:16, 17 లో చదువగలము “సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. ఆయన మాటవలన దయ్యములను వెళ్ళ గొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను.”
మనము (సమస్త మానవాళి) పాపములు చేసి రోగములను మరియు మరణమును కొనితెచ్చుకొనగా, వాటినుండి మనకు విడుదల కలుగజేయుటకు దేవుడైన యేసుక్రీస్తు తన అమూల్యమైన స్వరక్తమును సిలువలో చిందించెను. తన ప్రాణమును మన పాపములకు పరిహారముగా (విమోచన క్రయధనముగా) చెల్లించి, మన యెడల తనకున్న ప్రేమను యేసుక్రీస్తు కనుబరచెను. ఆయన రక్తము వెలకట్టలేనిది, అమూల్యమైనది. ఆయన సిలువపై మరణిస్తూ అనుభవించిన భయంకరమైన మరణ వేదన మన ఊహకు అందనిది. ఆయన మన ఎడల చూపిన ప్రేమ, కనికరము వలననే మనకు స్వస్థత కలిగెను. ఆయన మరణవేదన మరియు చిందించిన అమూల్యమైన రక్త పరిహారము వలన కలిగిన స్వస్థతకు మనము అర్హులము కాము అయితే యేసు క్రీస్తు ఈ లోకములో సంచరించినప్పుడు స్వస్థపరచబడిన అనేక జనులు స్వస్థతకు అర్హులు కనుక స్వస్థపరచ బడలేదు కానీ వారు స్వస్థపరచబడుటకు కారణం యేసు వారిని చూచి ప్రేమించి కనికరపడుటయే. అదే ప్రేమా కనికరములవలన దేవుడు ఈనాడు మనలను తన పిల్లలుగా భావించుచున్నాడు. “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది” (2 దినవృత్తాంతములు 16:9). మనలో ప్రతివాడును అనగా "బీదవాడైనను, ధనవంతుడైననూ" స్వస్థత కొరకు ఆయనయందు విశ్వసించి, ఆయన ప్రేమ, కనికరము వలన కలుగు స్వస్థతకొరకు వేడుకొనగలము.
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రార్థన
మనం శ్రమలు మరియు అనారోగ్యం పాలైనప్పుడు ఏమి చేయవలెనో, దేవుని వాక్యము స్పష్టముగా చెప్పుచున్నది. "మీలో ఎవనికైనను శ్రమ సంభవించేనా? అతడు ప్రార్థన చేయవలెను". (యాకోబు 5:13). మన ప్రతి అవసరతను ప్రార్థన ద్వారా ఆయన ఎదుట ఉంచే గొప్ప ఆధిక్యత ఆయనను విశ్వసించే ప్రతివారు కలిగియున్నారు. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుకొనును. ఆయన మన ప్రతి మనవి ఆలకించి జవాబిచ్చును. “మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును” (యాకోబు 5:14-15). అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి కొరకు చేయబడిన ప్రార్థనలో, ప్రార్థన చేయుచున్నవ్యక్తికి మరియు ప్రార్థన చేయించుకొనుచున్న వ్యక్తికి విశ్వసం కలిగి ఉన్నప్పుడు మన దేవుడు తప్పక సమాధానం ఇస్తాడు!
మానవులందరూ పాపములో పడకుండా, ఆయన చూపిన మార్గంలో తనతో బహు సన్నిహితంగా నడవాలని దేవుడు కోరుచున్నాడు. మనము ఆయన మార్గమున నిలిచినప్పుడు, ఆయన మనలను బహుగా ఆశీర్వదించును, తన ఆశీర్వాదములలో స్వస్థత కూడా ఒకటి, మరియు మనము ఆయనను సంతోషపరచిన వారమవుతాము. మనము ఆయనను సమీపించేటప్పుడు, మన ఆధ్యాత్మిక జీవితాలలో దేవునిపై పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండేలా చూచుకొనవలెను. మన జీవితంలో పాపం లేదా ఏ విషయములో అయినా దేవునికి లోబడకుండా ఉండకుండ చూచుకొనవలెను. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన కోరిక ప్రకారమే అన్ని పనులు జరగాలనే తలంపుతో దేవుని ప్రార్ధించకూడదు గాని, "నీ చిత్తమే సిద్ధించు గాక" అని యేసుక్రీస్తు ప్రార్థించి చూపిన ప్రకారమే మనము కూడా ప్రార్థించాలి.
మన ప్రార్థనలకు ఆశ్చర్యకార్యములు జరిగించుట ద్వారా దేవుడు సమాధానం యిచ్చే సందర్భాలు ఉండవచ్చు లేదా వ్యాధిని లేక అనారోగ్యాన్ని వెంటనే తీసివేయని సందర్భాలు కూడా ఉండవచ్చు. మనం కొంతకాలం సహించాలని దేవుడు కోరుకొనవచ్చును, మన విశ్వసాన్ని పరీక్షించే ఇటు వంటి సందర్భాల ముంగిట మనము ఓటమిని అంగీకరించవలసిన అవసరం లేదు. దేవుడు మనలను విశ్వాసములో మరింత అభివృద్ధి పరచుటకు లేదా మన విశ్వాసం పరీక్షించుటకు గాను, మన ప్రార్థనలకు జవాబు ఇచ్చుటకు తగిన సమయం కొరకు వేచియుండును.”నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును” (1 పేతురు 1:7). మనము దేవునియందు నిజముగా విశ్వాసముంచినప్పుడు, ఆయన మన ప్రార్థనలకు ఏ సమాధానం ఇచ్చిననూ, ఆయనను స్తుతింపవలెను. ఎందుకనగా, మనకు ఏది మంచిదో మనకంటే ఎక్కువగా ఆయనకే తెలియును.
మీరు శ్రమల పాలైయున్నారా? యేసుక్రీస్తును విశ్వసించండి. ఆయన తన వాగ్దానములన్నిటిలోను ఎన్నడూ తప్పిపోడు. ఆయన యందు మీరు ఉంచిన విశ్వాసము మరియు ప్రయాసము వ్యర్ధము కానేరదు.
మీరు గాని, మీ స్నేహితులెవరైనా గాని ఘోరమైన వ్యసనాలు లేదా భయంకరమైన వ్యాధుల చేత బాధపడుతున్నారా? యేసుక్రీస్తుకు ప్రార్థించండి. ఆయన నేటికి స్వస్థపరచునని నీవు వ్యక్తిగత అనుభవము ద్వారా తెలిసికొనగలవు.