FOREIGN LANGUAGES

క్షమాపణ

Telugu

మనమందరం మన జీవితాలలో మన పొరుగువారిపట్ల గాని, స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల పట్ల చేసిన తప్పులకు (పాపములకు) క్షమాపణ వేడుకునే పరిస్థితి ఏదో ఒక సమయంలో తప్పకుండా ఎదుర్కొంటాము. వైవాహిక జీవితంలో భార్యా భర్తల మధ్య వచ్చే చిన్న చిన్న బేధాభిప్రాయాలు కావచ్చు, లేదా చిన్న పిల్లల మనస్సులు గాయపడేలా మాట్లాడే తల్లితండ్రులే కావచ్చు, ఆ తప్పులు బహిరంగ ప్రదేశంలో, లేదా ఇంట్లో, లేదా ఆఫీసులో, లేదా దేవుని మందిరంలో కూడా జరగవచ్చు. నీవు నీ స్నేహితుడిని హేళన చేసి ఉండవచ్చు లేదా నీ స్నేహితుడు నిన్ను పదిమందిలో చిన్నచూపు చూసి ఉండవచ్చు. ప్రతి ఒక్కరూ తాము చేసిన తప్పులకు,ఆ బాధితులను క్షమించమని అడిగే పరిస్థితి ఏదో ఒక సమయంలో నిశ్చయంగా వస్తుంది.

అనేక మంది తమ పొరుగువారి మీద హృదయములో సంవత్సరాల తరబడి కోపంతో రగిలి పోతూ ఉంటారు. ఆ కోపానికి అనేక కారణాలు ఉండవచ్చు. బహుశా గతంలో ఇతరులు వీరి మీద అబద్ధ సాక్ష్యము చెప్పి ఉండవచ్చు లేదా అవమానించి ఉండవచ్చు. వారి హృదయాలలో ఉన్న భావాలకు మంచి కారణాలు ఉన్నాయని వారు అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ వేషధారణ, దుష్ట ఆలోచన, క్షమాగుణం  లేకపోవటం మరియు కోపము వంటి వాటిని మనము హృదయములో కలిగి ఉండకూడదని బైబిల్ గ్రంధం స్పష్టం చేస్తున్నది. "మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును, మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు" (మత్తయి 6:14-15) అని ప్రభువైన యేసు క్రీస్తు చెప్పెను.

అసలు "క్షమించుట" అంటే అర్థం ఏమిటి? మన ఎడల తప్పు చేసిన వారిని చూస్తే మనకు కలిగే కోపాన్ని విడిచి పెట్టడమే క్షమించుట, లేదా మరో మాటలో చెప్పాలంటే, మన ఎడల మన పొరుగు వాడు చేసిన తప్పుకు మనము ప్రతీకారం తీర్చుకునే హక్కును మరియు అవకాశాన్ని విడిచి పెట్టడమే క్షమించుట.

ఈ లోకంలో ప్రతి ఒక్కరికి క్షమాపణ అవసరం. బైబిల్ ప్రకారం, మానవులందరూ (సమస్త మానవాళి) జన్మతః పాపులు. కావున, మన పాపములకు క్షమాపణ పొందకుండా, మనము పరలోకరాజ్యము చేరుకోలేము. మన అపరాధములకు మనము దేవుని క్షమాపణ పొందాలంటే, ముందుగా మన ఎడల మన పొరుగు వారు చేసిన అపరాధములను మనము తప్పనిసరిగా క్షమించాలి, అని ప్రభువైన యేసు క్రీస్తు చెప్పెను. నన్ను భయంకరమైన అవమాన బాధకు గురి చేసిన వారిని అంత తేలికగా ఎలా క్షమించాలి? నేను ఎంత బాధ పడ్డానో, నన్ను బాధించిన వారికి తెలియాలి. అలా తెలియజెప్పుటకు నేను కఠినంగా ప్రవర్తించడం లో ఏమీ తప్పులేదు, పైగా అది నా హక్కు అని చాలామంది అనుకుంటారు. నిజమే, కొన్నిసార్లు మనం అనుభవించిన బాధను తలుచుకుంటే, మనలను బాధించిన వారిని క్షమించటం అసాధ్యం అనిపిస్తుంది.

అయితే మన ఎడల తప్పు చేసిన వారిని మనం హృదయపూర్వకంగా క్షమించాలని ప్రభువైన యేసుక్రీస్తు "మత్తయి సువార్త 18:35" లో చెప్పిన మాటను జ్ఞాపకముంచుకొనుము. నన్ను బాధించిన వారికి ప్రతికారము చేయాలని హృదయం రగిలిపోతుంటే, వారిని హృదయపూర్వకంగా క్షమించడం ఎలా సాధ్యం? అని నీవు ప్రశ్నించవచ్చు. నిజమే! ఆ సమయంలో హృదయపూర్వకంగా క్షమించడం అనేది చాలా కష్టమే. అయితే "ప్రార్ధన" చేయుట ద్వారా వారిని మనం హృదయపూర్వకంగా క్షమించగలము. కొంతమంది క్షమించే ఆత్మ కోసం కొంతకాలం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందని కనుగొన్నారు. కొందరు ఆ ఆత్మను నిలుపుకోవటానికి ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి అని కనుగొన్నారు. ఇలా ప్రార్థించకపోతే ఎంత త్వరగా శత్రువు చేదైన వేరును మన హృదయంలోనికి తిరిగి జేరుస్తాడు!

ఇతరులను క్షమించడం అంత సులభం కాదు మన పొరుగు వారిని క్షమించుటకు "క్షమాగుణం"  దయచేయమని దేవుని ప్రార్ధించవలెను. అలా ప్రార్థించకుంటే ఏమవుతుంది? అని కూడా నీవు ప్రశ్నించవచ్చు."మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు," జాగ్రత్తగా చూచుకొనుడి. (హెబ్రీయులకు 12:15) అని బైబిల్ చెప్పెను. క్షమాగుణం లేకుంటే, హృదయంలో దినదినము కఠినత్వం పెరిగిపోతుంది. ఏదో ఒక సమయంలో ఆ కోపం ఏదో ఒక అవాంఛనీయ సంఘటన రూపంలో బయటపడుతుంది. అప్పుడు మనం దేవుని ఎదుట దోషిగా నిలబడే భయంకరమైన పరిస్థితి వస్తుంది.

క్షమాగుణం లేని హృదయము మనకును, దేవునికి మధ్య అడ్డుగోడగా ఉండి, మన ప్రార్ధన విన్నపములను దేవుని సన్నిధికి చెరనీయదు. "మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్న యెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి". (మార్కు 11:25) అని ప్రభువైన యేసుక్రీస్తు హెచ్చరించెను.

మనం చేసిన తప్పులకు క్షమాపణ కోరిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కారం కాకపోయినప్పటికీ, దేవుని సహాయంతో క్రమేణా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.

క్షమాగుణం కలిగి ఉండే విషయంలో మన అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు తానే ఒక మంచి ఉదాహరణగా ఉన్నారు. ఆయన పాపము లేనివాడును, పరిశుద్ధుడై యున్నాడు. ఆయనపై తప్పుడు నిందారోపణలు చేయబడెను. ఆయన భయంకరంగా హింసించబడి, అవమానించబడి, సిలువపై ఆయన శరీరము మేకులతో కొట్టబడి, వ్రేలాడదీయబడెను. యేసు క్రీస్తు సిలువపై భయంకరమైన మరణ వేదన అనుభవిస్తున్న సమయంలోనూ "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము" (లూకా 23:34) అని ప్రార్థించెను. మనం ఆయనను అనుసరించాలి అంటే, ముందుగా ఆయన యొక్క క్షమాగుణాన్ని మనము కూడా కలిగి ఉండాలి మరియు ఆయన మాదిరిని అనుసరించడానికి ప్రయత్నించాలి.

ప్రభువైన యేసు క్రీస్తు శిష్యుడైన పేతురు "ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసిన యెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలను? ఏడు మారులమట్టుకా?" అని అడిగెను.అందుకు యేసు క్రీస్తు తన శిష్యుడైన పేతురుతో ఇట్లనెను - ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని చెప్పెను. (మత్తయి 18:21-22)

మన ఎడల భయంకరమైన తప్పు చేసిన వాడు, కొంతకాలము తరువాత పశ్చాత్తాప పడి తనను క్షమించమని వచ్చినపుడు, మనము "నిన్ను క్షమిస్తాను, కానీ........." అని కొన్ని షరతులు విధిస్తాము. అవి వారిని ఇరకాటంలో పడవేస్తాయి. అయితే, క్షమించుట అనేది మనఃపూర్వకముగా చేయాలి, ఎటువంటి ప్రతిఫలం లేదా నష్టపరిహారం ఆశించకుండా చేయాలి అని దేవుడు చెబుతున్నాడు. మనలను ద్వేషించి, వారి అవసరాలకు మన సహాయం ఆశించి, ఆ తరువాత మరచి పోయే వారిని, మనం మనః పూర్వకముగా క్షమించి నట్లయితే, పరలోకము నుండి చూస్తున్న మన తండ్రి మనకు గొప్ప బహుమానం ఇచ్చును. మనల్ని ప్రేమించి, మనతో స్నేహం చేసే వారిని మాత్రమే మనం ప్రేమిస్తే, అది గొప్ప విషయం ఏమి కాదు. అలా చేస్తే పాపులకును మనకును పెద్ద తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే పాపులు కూడా తమను ప్రేమించే వారిని ప్రేమిస్తారు.

మనము కూడా వేరొకరిని ఎప్పుడైనా గాయపరచి ఉంటే, మనలను క్షమించుమని వారిని తప్పక అడుగవలెను. "కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధ మేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము." (మత్తయి 5:23,24)

కొంతమంది తాము చేసిన పాపములకు పశ్చాత్తాపపడి ఆ తప్పును సరిదిద్దు కొనుటకు ప్రయత్నించినను, ఆ బాధిత వ్యక్తులు క్షమించకపోవచ్చును.అయితే దేవుని మాటలకు లోబడి మన పూర్ణ శక్తితో మన తప్పులను సరిదిద్దుటకు మనం ప్రయత్నించి ఉంటే, ఇక మనము చేయవలసింది ఏమియు లేదు. మనలను మనము తగ్గించుకొని క్షమాపణ అడిగిన తరువాత కూడా, మన పొరుగువారు మనతో సమాధాన పడుటకు ఇష్టపడనట్లయితే ఇక ఆ విషయాన్ని దేవుని హస్తాలకు అప్పగించాలి. మనము చేయవలసిన పని మనం చేసాము కాబట్టి దేవుడే వారి హృదయాలను మార్చును.

ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, అని మీరు ప్రశ్నించవద్దని బైబిల్ గ్రంధం సమస్త మానవాళిని స్పష్టంగా హెచ్చరిస్తున్నది. మనము చేయవలసింది ఏమిటంటే, ఆయా బాధితుల వద్ద మనము చేసిన తప్పులను ఒప్పుకొని సరిదిద్దుకొనుటయే. అలా చేయటానికి హృదయంలో దేవుని ప్రేమ అవసరం. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి వాని వ్యక్తిత్వము ఒకే విధంగా ఉండదు. కొంతమందితో కలిసి ఉండటం కష్టం. కొంతమంది వారి వ్యక్తిత్వము వలన తమ పాపములను క్షమించమని మనలను అడుగుటకు సంశయిస్తారు. అయితే, మనమే వారి తప్పులను క్షమించాలి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ బలహీనతలు ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో మనము కూడా మన పొరుగువారి పట్ల అనుచితంగా ప్రవర్తించినప్పుడు వారు కూడా గొప్ప సహనం కలిగి ఉండి ఉంటారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ పొరుగువారి పట్ల ఓర్పు మరియు సహనం కలిగి ఉండాలి. మనము ప్రేమ, క్షమాగుణం మరియు సహనం కలిగి ఉంటే దేవుడు మనలను ఘనపరచును.

క్షమాగుణం లేని హృదయం మన ఆత్మలకు శత్రువైన సాతాను చేతిలో బలమైన పనిముట్టుగా ఉంటుంది. దేవుని నుండి దూర పరచుటకు సాతాను ఆ సాధనమునే ఎక్కువగా ఉపయోగిస్తాడు. మన పొరుగువారి యెడల మనము కఠిన హృదయులుగా ఉంటే సాతాను మన హృదయంలో నివాసం ఏర్పరచుకొని, మనలను తన ఆధీనములో ఉంచుకుంటాడు. మనల్ని ఓడించడానికి సాతానుకి అనుమతించకుండా అతని ఓడించండి. క్షమాగుణం కొరకు దేవుని వైపు చూడండి. క్షమాగుణం కలిగి ఉండి సాతానుని ఓడించండి.