ఈ నిరాశానిస్పృహలు మన జీవితాలను నాశనం చేయును. ఇప్పటికే మీరు ఆ బాధను కనీసం ఒక్కసారైనా అనుభవించి ఉంటారు. తీవ్రమైన అనారోగ్యం అకస్మాత్తుగా మీ జీవన విధానాన్ని మార్చివేసి ఉండవచ్చు. (లేదా) మీ జీవిత భాగస్వామి కారణంగా మీ కుటుంబం చెల్లాచెదురై, మీ ఆశలు ఆశయాలు ఆవిరై, మీ జీవితానికి దిశానిర్దేశం లేక మిరు బాధపడుతూ ఉండవచ్చు. ఈ నిరాశానిస్పృహలు మనకు తెలియకుండానే మనలో ప్రవేశించును. అయితే దీనికి స్పష్టమైన కారణం చెప్పలేము. ఒక చిన్న వైఫల్యం లేదా తెలియని మనోవేదనలు ఈ నిరాశ నిస్పృహకు కొన్ని కారణాలుగా చెప్పవచ్చును.
తీవ్రమైన విపత్తు లేదా అస్పష్టమైన భయాల కారణంగా, ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నిరాశ నిస్పృహకు లోనవుతారు. కొన్నిసార్లు విచక్షణా జ్ఞానం కోల్పోతాము. మన జీవితం చేజారిపోయిందనే భావన, మనం ఒంటరివారం అనే తలంపుతో చెదిరిపోయిన హృదయంతో ఉన్నప్పుడు మనం ఎవరి వైపు తిరగవచ్చు?
దేవుని వాక్యమైన బైబిలు గ్రంథము వైపు తిరగవచ్చు మరియు బైబిలు చదువవలెను. ఇందులో మన హృదయమందు ఉంచుకొన తగిన సూచనలు ఇవ్వబడినవి. నిరాశ నిస్పృహల నుండి బయట పడుటకు ఇవి మనకు ఎంతగానో సహాయపడును. ఈ సూచనలు దేవుని వాక్యంలో పదేపదే కనిపించే "ఆజ్ఞ" రూపంలో ఇవ్వబడెను. "ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచు కొనుము యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. (కీర్తనలు 27:14) అని చదవగలము. "ధైర్యము తెచ్చుకొనుడి" అను మాట బైబిల్ గ్రంధంలో అనేక చోట్ల 15 సార్లు వ్రాయబడెను.
ఈ మాటలు అన్ని చాలా మంచివి కాని నిరాశా నిస్పృహలతో నేను ఎలాగు పొరాడగలను? అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇప్పటికే నిరాశా నిస్పృహలు నన్ను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, నేను ఎలాగు విడుదల పొందగలను? అని నీవు ప్రశ్నించవచ్చు. నిజమే, వీటిని అధిగమించడానికి గతంలో నీవు చేసిన ప్రయత్నాలు విఫలమైఉండవచ్చు. ఈ నిరాశానిస్పృహలు మనలను బాధిస్తూ ఒంటరిగా జీవించేట్టు చేసి, మనలను మనమే నిందించుకునెటట్టు చేయును. వీటిని మనము అధిగమించాలి. కాని ఎలా?
యేసు క్రీస్తు యొద్ధ మునకు జవాబు దొరుకును. జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటం, ప్రతి ఒత్తిడికి, ప్రతి భారమునకు, ప్రతి ప్రతికూల పరిస్థితులలో "నా కృప నీకు చాలును" (2 కోరింది 12:9) అని దేవుడైన యేసు క్రీస్తు చేసిన అద్భుతమైన వాగ్దానాన్ని మనము ఆధారం చేసుకొనవలెను. అంటే దేవుడు మనకు బలం, ప్రోత్సాహం, నిరీక్షణను, సమస్యను సహించుటకు శక్తిని మరియు ఆ సమస్యను అధిగమించగల ఆలోచనను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
అయితే, దేవుడు మన ఆత్మీయ స్థితిలోని లోపాన్ని గురించి మాట్లాడితే, మనము వాటిని విస్మరించకూడదు లేదా అణచివేయకూడదు లేదా మరువకూడదు కానీ, ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి. అదే సమయములో, మనము మన బలహీనతల నుండి విడుదల పొందినప్పుడు దేవుని ప్రేమకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. మనము ఎల్లప్పుడూ సంతోషముతో ఉండాలి. ఎందుకనగా, "దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము." (రోమా 8:28) అని దేవుడు వాగ్దానం చేసెను. మనలను కలవర పెడుతున్న "నిరాశా నిస్పృహలను" అధిగమించుటకు ఆయన కృప మరియు శక్తిని మనకు అనుగ్రహించుమని దేవుని అడుగవలెను. మనము ప్రతి చెడు ప్రేరేపణను ఎదిరించాలి. మరియు మన పరిస్థితికి మనమే జాలిపడే తత్వాన్ని విడనాడాలి. లేకుంటే, అది మనలను మరింత నిరాశానిస్పృహలలోనికి నెట్టివేస్తుంది.
మనము ముఖ్యముగా గుర్తుంచుకొనవలసినది ఏమిటంటే - ఈ లోకంలో కేవలం మనం మాత్రమే కాదు కానీ, ప్రతి మానవుడు ఈ దుస్థితిని, మన ఆత్మలకు శత్రువైన సాతాను నుండి, ఎదుర్కొంటాడు. యేసు క్రీస్తు లొ శాంతి, సమాధానము లేకుండా చేయుట సాతాను పని. వాడు ఈ విధమైన వ్యూహాన్ని, మాయోపాయములను వేలాది సంవత్సరముల నుండి అభ్యసిస్తున్నాడు. "మోషే, యెహోషువ మరియు ఏలియా" వంటి దైవజనుల జీవిత గాథలను చదువుతున్నప్పుడు వారు కూడా కొన్ని సమయాలలో నిరాశ నిస్పృహలకు లోనైన విషయాన్ని మనము గ్రహించగలము. అయినప్పటికీ, దేవుని కృప వారిని విడిచిపెట్టలేదని వారు కనుగొన్నారు. దేవుడు వారి క్లిష్ట పరిస్థితులను పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకొనెను.
ఇందులో మనము గ్రహించవలసిన విషయం ఏమిటి?మనము ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కూడా దేవుని కనుదృష్టి నుండి తప్పించుకోజాలదని మనము తప్పక గుర్తుంచుకోవాలి. మన జీవితాలలో ఏ సమస్య ఎప్పుడు, ఎందుకు వస్తుందో దేవునికి తెలుసు. "ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును" అని (కీర్తనలు 37: 23) లో చదువగలము. "ఆ వాగ్దానాన్ని పట్టుకోండి, మనలను నిరాశ నిస్పృహలకు గురి చేస్తున్న పరిస్థితులను దేవుడు తన ఆధీనంలో ఉంచుకొన్నాడను సత్యాన్ని గ్రహించుము". విజయం కొరకు దేవుని వైపు చూడుము. దేవుడు సమాధానమిచ్చునని విశ్వసించుము. అప్పుడు నీ విశ్వాసమును బట్టి ఆయన తప్పక జవాబిచ్చును.
కొన్ని సార్లు మన స్వంత వైఫల్యాలు మనలను కష్ట నష్టాలకు గురి చేస్తాయి. కానీ, వాటిని కూడా ఎలా పరిష్కరించాలో దేవుని వాక్యం చెబుతుంది. మహా భక్తుడు మరియు రాజైన దావీదు కూడా పాపము చేసెను. దేవుని దృష్టిలో అపరాధియాయెను. కానీ, అతడు దేవుని దయ మరియు క్షమాపణను వేడుకొన్నప్పుడు, దేవుడు దావీదును క్షమించి తిరిగి నిలబెట్టెను. మనం ఎంత ఘోరంగా విఫలమైనా, మనము మన పాపములను ఒప్పుకొని, వాటిని విడిచి పెట్టినట్లయితే దేవుడు మనలను క్షమించును. ఆయన "బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇచ్చును" (యెషయా 61:3)
మనము పరిస్థితులను సరిదిద్దే అవకాశం చేజారిపోయినప్పుడు, మన సామర్థ్యానికి మించినవి అయినపుడు, అధైర్యపడొద్దు. విరిగిన కల, విరిగిన జీవితం లేదా విరిగిన హృదయం యొక్క ముక్కలను తిరిగి కట్టడం అసాధ్యం అనిపించవచ్చు కానీ దేవునికి అసాధ్యమైన కార్యము, పరిష్కరించలేని సమస్య ఏదియు లేదు. మనము నిరుత్సాహముతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆయన సహాయం చేయగల సమర్ధుడు. యేసు క్రీస్తును మన జీవితాలలో కలిగి ఉంటే మనము ఎల్లప్పుడు జయశాలులుగా ఉంటాము. ఎన్నడూ బాధితులుగా మిగిలిపోము.
నిరాశా నిస్పృహలను ఎదిరించి జయించుటకు సూచనలు:
- యోహను 14: 27 లేఖన భాగము చదివి యేసు క్రీస్తు చేసిన వాగ్దానమును ధ్యానించుము.
- ప్రభువైన యేసు క్రీస్తు చేసిన విధముగా, దేవుని వాక్యము తో సాతానుని ఎదిరించుము.
- ప్రభువైన యేసు క్రీస్తు సహాయంతో గతంలో నీవు పొందిన విజయాలను మరియొక సారి జ్ఞాపకం చేసికొనుము.
- ప్రార్ధించుము. నిరాశ నిస్పృహలను జయించుటకు దేవుని సహాయం కొరకు వేడుకొనుము.
- మికు ఇష్టమైన పాట పాడండి
- ధైర్యము, నిబ్బరమును గూర్చి దేవుడు చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొని, వాటిని ధ్యానించుము.
- నిరుత్సాహానికి లోనుకాకుండా మీరు ఏమి చేయాలని ప్రభువు మిమ్మల్ని కోరుకుంటున్నాడో తెలుసుకోండి. ప్రభువు ఎల్లప్పుడూ వేరొక మార్గం కల్పించగలడు
- నిరుత్సాహపడటం వల్ల సాధ్యమయ్యే అన్ని ఫలితాల పట్టిక ఒక కాగితంపై వ్రాసుకోండి. తరువాత ప్రోత్సహించపడటం వల్ల సాధ్యమయ్యే అన్ని ఫలితాల పట్టిక తయారు చేయండి.
- ప్రభువైన యేసు క్రీస్తు మీ కొరకు తండ్రియైన దేవుని ప్రార్థిస్తున్నాడని గ్రహించి ధైర్యముగా నుండుము (హెబ్రీ 7: 25 చూడండి).
- చర్య తీసుకోండి! ఒకరి కోసం ఏదైనా చేయండి.